psychokinesis

సైకోకైనసిస్

Psychokinesis In Telugu :

మూఢ నమ్మకాలుగా ప్రచారం పొందినవన్నీ మూఢ నమ్మకాలు కావు. అలా అని అన్ని నమ్మకాలూ నిజమేననటమూ న్యాయం కాదు. నమ్మకమనేది విచిత్రమైనది. దేవుడున్నాడని కొందరి నమ్మకం కాగా, దేవుడు అసలు లేనేలేడని కొందరి నమ్మకం. రెండూ నమ్మకాలే. ఎవరి వాదనలు వారికున్నాయి.

అభివృద్ధి చెందిన కొన్ని దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో మూఢ నమ్మకాలు చాలా తక్కువనే చెప్పాలి. మూఢ నమ్మకాల విషయంలో ఇండియాది ఆరవది. అభివృద్ధి చెందిన దేశాలలోని శాస్త్రజ్ఞులు నమ్మకాలను గురించి పరిశోధనలు చేసి, కొన్నింటికి వివరణలు ఇచ్చి సమర్ధించారు.

చక్కగా దబ్బపండులా ఉన్న కుర్రాడిని చూసి,అబ్బా ఎంత బాగున్నాడో.,అని ఒక్కొక్కరు అన్నపుడు వెంటనే జబ్బు పడడం, నే పైర్లు ఎంత కళకళ లాడుతున్నాయో అని ఒక్కో మనిషి అన్నపుడు అది ఉన్నట్టుండి మారిపోవడం లాంటి విషయాలను దిష్టిగా భావించి ఆ వ్యక్తి కళ్ళు మంచివి కావని అంటుంటారు.

దిష్టి మూఢ నమ్మకం కాదని తేల్చారు. ఇటీవల పారా సైకాలజీ శాస్త్రజ్ఞులు. ప్రతి మనిషి కళ్ళలోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని,ఆ శక్తిని సరైన పద్దతిలో వినియోగించుకోగల్గుతే ఎన్నో అద్భుత కార్యాలను కూడా చేయగలరని అన్నారు. మనిషి మెదడు అద్భుతమైనది సగటు మనిషి అందులో కేవలం 10 వ వంతు శక్తినే ఉపయోగించుకోగల్గుతున్నాడు. మిగితా 90 వంతులు ఉపయోగించుకోగల్గినవాడు మనిషి మహా శక్తి వంతుడవుతాడు.

దిష్టి ద్వారా వస్తువులలో మార్పు తీసుకువచ్చే,వ్యక్తులలో దృష్టి కేంద్రాన్ని కంట్రోల్ చేసే భాగం చాల చురుకుగా శక్తి వంతంగా ఉంటుందని,పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుల భావన. సైకోకైనసిస్ గా వ్యవహరింపబడుతున్న ఈ శక్తి ప్రతి 1000 మందిలో ఒకరికి ఉండవచ్చునని,ప్రముఖ పారా సైకాలజీ శాస్త్రజ్ఞుడు జె.బి. రైన్ అన్నారు. ఈ శక్తి వినియోగంలో సాధన ఉపయోగపడుతుందని ఆ అభిప్రాయం.

సైకోకైనసిస్ గురించి ప్రదర్శన t.v లో జరుగుతుండగా చూసి,ఉతేజితులై తమకు కూడా అటువంటి శక్తులు సంక్రమించే అవకాశం ఉన్నదేమో అని ప్రయత్నించి విజయం పొందిన 8 మందిని శాస్త్రజ్ఞులు పరీక్ష చేసి, వారికీ కూడా సైకోకైనసిస్ శక్తి ఉందని అది కొన్ని డిగ్రీల తేడాలో ఉందని ప్రకటించారు.

ఇంగ్లాండ్ లో మానింగ్ అనే యువకుడు కొందరి ప్రముఖుల సమక్షంలో ముందే పరీక్ష చేసిన చెంచాలను,ఫోర్క్ లను కేవలం కళ్ళతో తీవ్రంగా చూసి,అవి పూర్తిగా వంగిపోయేలా చేసాడు. తను స్వయంగా చూసిన ఈ విషయాన్ని “జోల్ విట్టన్ “అనే శాస్త్రజ్ఞుడు “ది లింక్ ” అనే పత్రికలో వివరిస్తూ ఇందులో ఎటువంటి మోసము లేదని నిర్ధారించారు.

అలిసన్ లాయిడ్ అనే 11 సంవత్సరాల బాలిక ప్రదర్శించిన అసాధారణ సైకోకైనసిస్ శక్తిని సునిశితంగా పరిశోధించిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు జాన్ టేలర్ లాయిడ్ తన శక్తిని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తే యురిగెల్లర్ ని మించిపోగలడని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ పత్రిక న్యూ సైంటిస్ట్ లాయిడ్ గురించి ఒకే సంవత్సరంలో 3 సార్లు సంపాదకీయాలు రాసింది.

చిన్నపిల్లల్లో ఇటువంటి శక్తులు ప్రస్ఫుటంగా గోచరిస్తాయని, వాటిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పిస్తే అద్భుతమైన కార్యాలు చేయవచ్చునని భావించి 1973లో టోక్యో మహానగరంలో దెంకీ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ షిగెమీ సపాకీ అతీంద్రియ కార్యాలు,ముఖ్యంగా సైకోకైనసిస్ ప్రదర్శించే 15 బాలబాలిక చేత అద్భుత శక్తుల ప్రదర్శన చేయించారు.

సదస్సుకు విచ్చేసిన అతిధులు, సైంటిస్టులు, మేజీషియన్లు, జర్నలిస్ట్ లు, విమర్శకులు ప్రదర్శనలు చూసి ముగ్ధులయ్యారు.

మంత్రం,తంత్రం, యంత్రం సహాయం లేకుండా కేవలం దృష్టి ద్వారా ఒక వస్తువులో మార్పు తీసుకురావడం అనేది అతీంద్రియ శక్తి కాక మరేమిటని విస్తుపోయారు. ఆ బాలబాలికల్లో ముఖ్యంగా 12 ఏళ్ళ కుర్రవాడయిన జెన్ సెకిగుచి ప్రదర్శించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.

ప్రేక్షకులు పరీక్ష చేసిన తాళం చెవులను టేబుల్ పై ఉంచి వాటిని ఆ కుర్రాడు సూటిగా కనురెప్ప వాల్చకుండా ఒక నిమిషం పటు చూడగానే అవి వాటికవే ఒంపులు తిరిగిపోయాయి.

యూరీగెల్లర్,మానింగ్,జెన్ సెకిగుచి ప్రభృతులు ప్రదర్శించిన ఈ అసాధారణ ప్రజ్ఞలను చూసి ఉతేజితురాలైన మిస్ చార్ల్ టన్ అనే 18 ఏళ్ళ అమ్మాయి ఒక రోజు తన తండ్రి హుక్కా పొగ పీలుస్తూ ఈ శక్తి  గురించే ఆలోచిస్తూ ఆమె హుక్కా గొట్టం కేసి మొత్తం చూసిందట.

అంతే! మరుక్షణం ఆ వైపు మెల్లగా వంగడం మొదలు పెట్టింది. అది చూసి కంగారుపడి తండ్రి హుక్కాను నోటి నుంచి బయటకు తీసి,తిరిగి దానిని సరిచేసాడు.

అనుకోని ఫలితం కలగడం వలన అత్యంత ఆనందంతో చార్ల్ టన్ తన తండ్రిని బతిమాలి ఆ హుక్కాను మళ్ళీ కలుస్తుండగా వంచి చూపింది. తర్వాత కొందరు సైంటిస్టులు సమక్షంలో కూడా ఈ క్రియను చేసి చూపింది. కానీ తనకు ప్రదర్శనలిచ్చి ప్రజల మెప్పు పొందాలనే కోరిక లేదని చెప్పింది.

అదే విధంగా సైకోకైనసిస్ ప్రదర్శించే వ్యక్తులు మనదేశంలోనూ ఉన్నారు. కానీ వారికి పబ్లిసిటీ అవసరం లేదు. సత్యాన్వేషణే వారి ధ్యేయం.

అంతేకాకుండా ఇదే లక్ష్యం కలిగిన కొన్ని సొసైటీ లు కూడా ఉన్నాయి. వారి పరిశోధనలు,పరీక్షలు వారికి మాత్రమే పరిమితం. ఎవరేమనుకున్నా వారు తమ పరిశోధనలు ఏకాగ్రతతో కొనసాగిస్తూనే ఉన్నారు.

By Dr. B.V.Pattabhiram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *